Jiiva | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణాది సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమ అంతటా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఒక అగ్ర నిర్మాతను కోల్పోవడం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. తండ్రి అకాల మరణం నటుడు జీవాను తీవ్రంగా కలచివేసింది. తన జీవితం
లో తండ్రిని కేవలం నిర్మాతగానే కాకుండా, ఒక మార్గదర్శిగా భావించిన జీవా ఈ వార్త విన్న వెంటనే కన్నీరుమున్నీరయ్యారు. ఫోన్లో మాట్లాడుతూనే వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆయన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఆ అనుబంధం ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.సూపర్ గుడ్ ఫిల్మ్స్ ద్వారా ఆర్.బి. చౌదరి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా తెలుగులో సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, సుస్వాగతం, స్నేహం కోసం, నిన్నే ప్రేమిస్తా, శీను, సింహరాశి, సంక్రాంతి, రచ్చ, గాడ్ ఫాదర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆయన నిర్మాణంలో వచ్చాయి.
తెలుగు-తమిళ రీమేక్‌లలో ఆయన ప్రత్యేక ప్రతిభ చూపారు. అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తదితరులతో పాటు యువ హీరోలతో కూడా సినిమాలు నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. ఆర్.బి. చౌదరికి నలుగురు కుమారులు. వారిలో జితన్ రమేశ్ నిర్మాతగా రాణిస్తుండగా, జీవా హీరోగా దక్షిణాదిలో మంచి గుర్తింపు పొందారు. ఇతర కుమారులు కూడా వ్యాపార, నిర్మాణ రంగాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో విశాల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మకుటం’ సెట్స్‌పై ఉంది. కొత్తవారిని ప్రోత్సహించడంలో ఆర్.బి. చౌదరి ఎప్పుడూ ముందుండేవారు. పలువురు దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేసి, వారికి జీవితాన్ని ఇచ్చిన నిర్మాతగా ఆయన పేరుగాంచారు. తమిళ నటుడు శరత్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే చెందింది.
ఉదయపూర్‌లో జరిగిన ప్రమాదం అనంతరం ఆయన పార్థివ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై చేరుకున్న తర్వాత సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.