Jigris | టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘జిగ్రీస్’. రోడ్ ట్రిప్ – ఫ్రెడ్షిప్ జానర్లో వచ్చిన ఈ సినిమాకు హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా.. మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మించాడు. వినయ్ కుమార్ చిటెం, కృష్ణ బురుగుల సహ-నిర్మాతలుగా ఉన్నారు. యూత్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం.
కథ:
కార్తిక్ (కృష్ణ బూరుగుల), ప్రవీణ్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) – ఈ నలుగురు ప్రాణ స్నేహితులు. ఓ రాత్రి సరదాగా మద్యం సేవిస్తూ.. ఇన్ టూ ది వైల్డ్ (Into the Wild) అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూసి స్ఫూర్తి పొందుతారు. దీంతో వారికి గోవా వెళ్లాలనే ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన రాగానే తమ పాత మారుతీ 800 కారులో ప్రయాణాన్ని మొదలుపెడతారు. మార్గమధ్యంలో కారు మొరాయించడంతో దాన్ని రిపేర్ చేసే క్రమంలో కథలోకి ఒక ఆసక్తికరమైన కొత్త పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుండి తిరిగి ప్రయాణమైన ఈ నలుగురు స్నేహితులు చివరకు గోవా చేరుకున్నారా? ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? గోవాలో వీరు చేసిన అల్లరి ఏంటి? ఈ ప్రయాణం వారి జీవితాలలో ఎలాంటి అనూహ్య మార్పులు తీసుకువచ్చింది? – అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ: టైటిల్‌కు తగ్గట్టే ఇది నలుగురు జిగ్రీ దోస్తుల కథ. ఇలాంటి సినిమాల్లో పకడ్బందీ కథనం కంటే, నిరంతరాయమైన హాస్యం ముఖ్యం. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వించగలిగితే చాలు సినిమా విజయవంతమైనట్లే. ఈ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊరిలో జరిగే నాటుకోడి ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తాయి. ‘కాండోమ్’ చుట్టూ అల్లిన కామెడీ సీన్ అయితే థియేటర్లో హిలేరియస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మావోయిస్టుల బ్లాక్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ‘జిగ్రీస్’ కథలో ఊహించని మలుపులు లేకపోయినా, ‘అరే, మా ఫ్రెండ్ గ్యాంగ్ కూడా ఇంతే కదా!’ లేదా ‘ఇది మా స్టోరీనే!’ అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మన కథనే తెరపై చూసుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే చివరి 15 నిమిషాలు మాత్రం సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తాయి. మనసు బరువెక్కి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ‘ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది’ అని ప్రేక్షకులు తడిసిన కళ్లతో, చెమర్చిన భావోద్వేగంతో థియేటర్ నుంచి బయటకు వస్తారు.
నటీనటులు
కృష్ణ బూరుగుల: లీడ్ రోల్లో ఆకట్టుకున్నాడు. సినిమా మొదల నుండి చివరి వరకు తన నటనతో కథను ముందుకు నడిపించాడు.
ధీరజ్ ఆత్రేయ: చాలా సహజంగా, అమాయకమైన నటనతో కామెడీని అద్భుతంగా పండించాడు.
మని వాక: సినిమాలో కీలకమైన పాత్ర ఇతనిదే. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే, ముఖ్యమైన ఎమోషనల్ సీన్స్‌లో నటనకు మరికొంత మెరుగు అవసరం అనిపిస్తుంది.
రామ్ నితిన్: తన పాత్రలో బాగా నటించాడు.
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా, బాగుంది. కమ్రాన్ అందించిన సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. స్వప్నిక్ రావు సౌండ్ డిజైన్, శ్యామల్ సిక్దర్ మిక్సింగ్ బాగుంది. చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్, నితీష్ మిశ్రా కలరింగ్‌తో మెప్పించారు. ఇక దర్శకుడు హరీశ్ రెడ్డి ఉప్పుల తెలిసిన కథే అయిన కొత్తగా తెరకెక్కించడంలో విజయం సాధించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా ‘జిగ్రీస్’ అనేది మన చిన్ననాటి ప్రాణ స్నేహితులతో గడిపిన తీపి జ్ఞాపకాలను, సరదా క్షణాలను మళ్లీ గుర్తుచేసే సినిమా. నవ్వుతో మొదలై, చివర్లో కన్నీటితో ముగిసే ఎమోషనల్ రైడ్ ఇది.
రేటింగ్: 3/5