జువెల్ థీఫ్- ద హీస్ట్ బిగిన్స్
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా, కునాల్ కపూర్ తదితరులు,
దర్శకత్వం: కుకీ గులాటీ – రాబీ గ్రేవాల్
OTT Hit | హీరోనే ‘దొంగ’గా వచ్చిన ఎన్నో సినిమాలు.. ప్రేక్షకులకు ‘కిక్’ను అందించాయి. బాలీవుడ్‌లోనూ ‘ధూమ్’ అంటూ.. థియేటర్లలో దుమ్ములేపాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. అదే థీమ్‌తో వచ్చిన మరో బాలీవుడ్ దొంగ సినిమా.. జువెల్ థీఫ్. నేరుగా ఓటీటీలోకే వచ్చి, యాక్షన్ థ్రిల్లర్‌గానూ ప్రేక్షకుల మనసులు దోచేస్తున్న ఈ చోరీ స్టోరీలోకి వెళ్తే.. రెహాన్ రాయ్ (సైఫ్ అలీఖాన్) ఒక కాన్ ఆర్టిస్ట్. మాస్టర్ థీఫ్ కూడా. కుటుంబానికి దూరంగా ఉంటూ.. విలువైన వజ్రాలు దొంగతనం చేస్తుంటాడు. ప్రపంచ దేశాలు చుట్టి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆర్ట్ కలెక్టర్ ముసుగులో ఉండే క్రిమినల్ రాజన్ ఔలఖ్ (జైదీప్ అహ్లావత్).. రేహాన్‌ను భారత్‌కు రప్పిస్తాడు. రేహాన్ తండ్రిని అడ్డుపెట్టుకొని.. రూ.500 కోట్లకుపైగా విలువ చేసే ‘రెడ్ సన్’ అనే వజ్రాన్ని దొంగిలించి తనకు అప్పగించాలని బెదిరిస్తాడు.
ఆఫ్రికాకు చెందన ఆ వజ్రాన్ని.. అక్కడి రాజవంశీకులు 18వ శతాబ్దం నుంచీ కాపాడుకొంటూ వస్తుంటారు. అయితే, ఆ వజ్రాన్ని కొన్ని రోజులపాటు ముంబయిలోని ఓ మ్యూజియంలో ప్రదర్శనకు పెడతారు. అప్పుడే దాన్ని దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తారు. మరి.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ఆ వజ్రాన్ని రెహాన్ చోరీ చేస్తాడా? రెహాన్‌ను పట్టుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న పోలీసు అధికారి విక్రమ్ పటేల్ (కునాల్ కపూర్) ఆ దొంగతనం ఆపగలుగుతాడా? కన్నతండ్రే రెహాన్‌ను ఎందుకు ఇంటినుంచి గెంటేస్తాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. సినిమా చూడాల్సిందే!