Jayamma Panchayithi Trailer | సుమ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. సుమ తన యాంకరింగ్, ప్రాసలు, పంచ్లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం సుమ వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈవిడ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను పవన్ కళ్యాణ్ విడుదల చేశాడు.
‘రా బావా.. మా ఊరి పంచాయితి చూద్దువు గాని, యే ఊర్లో జరగిని గోడవ ఒకటి జరగుతుంది’ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఏంటి జయమ్మ నువ్వు పంచాయితికి రావడమేంటీ’ అని ఓ పెద్ద మనిషి అడుగగా.. ‘నేనేందుకు వస్తాను, మీరే వచ్చేటట్టు సేసినారు’ అంటూ సమ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘కష్టమో నష్టమో ఏటైనా మనమే చూసుకోవాలి కాని ఇలాగా పంచాయితి పెట్టి పరువు తీసుకుంతమా’ అంటూ దేవిప్రసాద్ సుమపై అరువగా ‘ఈ ఒక్క విషయంలో నువ్ ఏటీ సెప్పిన నేను వినను మాయ్యా’ అంటూ సుమ చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘సత్య మీ ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా’ అని ఒక అమ్మాయి అడుగగా, ‘నేనింత ఎదవనని తెలిసిన తర్వాత కూడా నాకు గుడిచ్చారంటే నేను బ్రహ్మణుడు అవడం వలనే కదండి’ అంటూ వచ్చే డైలాగ్స్ ఆ ఊర్లో కాస్ట్ ఫీలింగ్ బాగా ఉందని తెలుస్తుంది.
‘ఎవరి వల్ల చెడ్డావురా ఈరన్న అంటే, నోటి వల్ల చెడ్డానురా కాటమురాజా’ అన్నాడట అంటు సుమ ఉత్తరాంధ్ర యాసలో పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘నా కర్మ ఏంటో ఊర్లో సమస్యలన్ని మా ఆయన జబ్బు చుట్టే ఉంటాయి’ అంటూ వచ్చే డైలాగ్ సుమ భర్త ఏదో జబ్బుతో భాద పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్ను గమనిస్తే ఊరి చుట్టు సాగే కథలా అనిపిస్తుంది. ప్రతి రోజు ఆ ఊరు పేరు న్యూస్ పేపర్లో రావడం.. ఊర్లో సమస్యలకు జయమ్మను జోక్యం చేసుకోవద్దు అంటూ చెప్పడం సినిమాపై ఆసక్తిని కలగ జేస్తున్నాయి.