సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో విజయాలను అందుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. పి.కిరణ్ నిర్మాత. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ సమర్పకుడు. సూపర్‌స్టార్ కృష్ణతో ‘అగ్నిపర్వతం’ వంటి బ్లాక్‌బస్టర్‌ని నిర్మించిన అశ్వనీదత్.. ‘రాజకుమారుడు’ సినిమాతో మహేశ్‌బాబును హీరోగా వెండితెరకు పరిచయం చేశారు.
ఆయన సమర్పణలోనే జయకృష్ణ ఘట్టమనేని కూడా పరిచయం కానుండటం విశేషం. నటన, నాట్యం, సంభాషణాపటిమ, పోరాటాలు తదితర అంశాలపై శిక్షణ తీసుకొని, పక్కా తెలుగు హీరోగా అలరించేందుకు జయకృష్ణ సిద్ధమయ్యారని, ఏడు కొండల నేపథ్యంలో నిజాయితీ, రియలిజం, భావోద్వేగాల మేళవింపుగా సాగే ప్రేమకథ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానున్నది. టైటిల్‌తోపాటు మిగతా వివరాలు తెలియాల్సివుంది. చందమామ కథలు బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనున్నది.