జాన్వీకపూర్, ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు దక్కించుకుంటున్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. ఇటీవలే ఈ చిత్రాన్ని టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించగా..అక్కడ కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి జాన్వీకపూర్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఈ సినిమా ఒప్పుకునేముందు ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదని, ఓ సాధారణ సినిమాగానే భావించానని జాన్వీకపూర్ పేర్కొంది. షూటింగ్ టైమ్‌లోనే సినిమా గొప్పతనం అర్థమైందని, టీమ్ అందరిలో ఏదో అద్భుతాన్ని సృష్టించబోతున్నామనే భావన కలిగిందని చెప్పింది. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు పది నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ లభించడంతో ఈ కథ ఎంతగా ఒక్కొక్కరి హృదయాల్ని కదిలించిందో అర్థం చేసుకున్నా. గొప్ప కథలో భాగమైనందుకు గర్వంగా అనిపించింది’ అని జాన్వీకపూర్ తెలిపింది.
ఈ తరహా చిత్రాల వల్ల ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది తనతో చెప్పారని, కానీ ట్రోల్స్ గురించి ఏరోజూ పట్టించుకోలేదని జాన్వీకపూర్ వ్యాఖ్యానించింది. భారతీయ జర్నలిస్ట్ బషరత్పీర్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రాసిన కథనం ఆధారంగా ‘హోమ్‌బౌండ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉత్తరాదిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు సూరత్ నగరానికి చేరుకొని అక్కడ పోలీస్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.