Janhvi Kapoor|అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కో సినిమాలో తన టాలెంట్ చూపిస్తూ స్టార్ హీరోయిన్ అయింది. జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా తన గ్లామర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌లో కనిపిస్తూ కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతూ ఉంటుంది. గత ఏడాది ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ చిన్నది ఈ చిత్రంలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్సీ16లో కూడా జాన్వీ కపూర్ కథానాయిక. అయితే ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టిన రోజు (మార్చి 6) కాగా, నేడు ఈ అమ్మడు 28వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో అభిమానులు, సెలబ్రిటీలు జాన్వీకపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అలానే ఆర్సీ 16 చిత్ర బృందం కూడా జాన్వీకి వెరైటీగా విషెస్ తెలియజేసింది.. మూవీలోని ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీకపూర్ కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళుతుంది.. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ కేక పెట్టిస్తుందిగా అని కామెంట్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ RC16 కాగా, ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు, చరణ్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్టు అర్ధమవుతుంది. గేమ్ ఛేంజర్‌తో నిరాశపరచిన రామ్ చరణ్ ఈ మూవీతో అదరగొట్టబోతున్నట్టు తెలుస్తుంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త అవతారం లో కనిపించి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.