ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంతో వార్తల్లో ఉండే తారాల్లో జాన్వీకపూర్ ఒకరు. నిజానికి సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది జాన్వీకపూర్. రీసెంట్గా ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ల ప్రవర్తనపై ఈ అందాలభామ ఇరిటేట్ అయ్యింది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో కూడా చూడకుండా, ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంపై జాన్వీకపూర్ బాహాటంగానే భగ్గుమంది. ‘అందంగా ఫొటోలు తీయడం ఓ కళ. అలాగే ఫొటోలకు ఫోజులివ్వడం కూడా కళే. అయితే దీనికి వేళాపాళా అవసరం. మేం సిద్ధంగా లేనప్పుడు, ఎలా పడితే అలా ఫొటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల.. నెటిజన్ల నుంచి విమర్శలు మేం ఎదుర్కోవలసి వస్తున్నది. ‘హాట్‌గా లేదు.. అందంగా లేదు..’ అంటూ వాళ్లు కామెంట్లు పెడుతుంటే, ఒక నటిగా నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించారా?. జిమ్కెళ్లినా, ఎయిర్పోర్ట్కెళ్లినా, ఏ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైనా ఈ పాపరాజీలు(ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్లు) మాత్రం మమ్మల్ని వదలడం లేదు. దయచేసి వారందరికీ నేను మనవి చేసేదొక్కటే. మా ఫొటోలు తీయండి. కానీ మా అంగీకారంతో తీయండి. మేం సిద్ధంగా లేనప్పుడు ఫొటోలు తీసి, మా అందానికి చెడ్డ పేరు తేవొద్దు.. ప్లీజ్’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.