Janhvi Kapoor | మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌లో చోటుచేసుకున్న హాస్పిటల్ దాడి ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలచిత్కా క్లినిక్ అనే పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు నెట్టింట్లో వైరల్ అవుతూ, రెండు వర్గాల మధ్య తప్పు ఎవరిది అన్న చర్చను తెరపైకి తెచ్చాయి. గోకుల్ ఝా అనే వ్యక్తి తన తల్లిని చూపించేందుకు బాలచిత్కా క్లినిక్‌కు తీసుకువచ్చాడు. అప్పటికి డాక్టర్ డ్యూటీలో లేకపోవడంతో, రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న సోనాలి కలసరే అతనిని వేచి ఉండమని సూచించింది. క్యూలో ఉండాలని చెప్పిన ఆమె సూచనను పట్టించుకోకుండా, గోకుల్ డైరెక్ట్‌గా డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఈ సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వచ్చిన వీడియోల్లో, గోకుల్ ఝా రిసెప్షనిస్టు సోనాలిని జుట్టు పట్టుకుని లాగడం, కాలితో తన్నడం, కొట్టే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఫుటేజ్‌పై తీవ్ర స్పందన వ్యక్తమైంది. మరో వీడియోలో, రిసెప్షనిస్ట్ సోనాలి కలసరే మొదటగా గోకుల్ తల్లిపై చెంపదెబ్బ కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం బయటకు రావడంతో, “తప్పు రెండువైపులా ఉందేమో” అనే వాదనలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. కొందరు కామెంట్ చేస్తూ.. ఆ మహిళ మొదట గోకుల్ తల్లిని కొట్టింది. కానీ గోకుల్ చేసిన దాడిని న్యాయంగా చెప్పలేం” అని పేర్కొన్నారు.
సోనాలి కలసరే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, గోకుల్ ఝా పై మాన్పడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సంఘటనపై నెటిజన్ల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు గోకుల్ దాడిని ఖండిస్తుంటే, మరికొంతమంది సోనాలి ప్రవర్తనపై ప్రశ్నలు వేస్తున్నారు. అయితే దీనిపై జాన్వీ కపూర్ కూడా స్పందించింది. ఇలాంటి ప్రవర్తన సరైనదా, అవతిలి వ్యక్తిని ఎలా కొడతారు, మానవత్వం కూడా లేకుండా చేసిన ఈ పనికి ఎవరైన అతనితో కలిసి ఉంటారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య.. ఇలాంటి వాటిని మనం ఏ మాత్రం క్షమించకూడదు. దీనిని ఖండించి అతడిని శిక్షించాల్సిందే. లేకపోతే మనకే సిగ్గు చేటు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి అంటూ జాన్వీ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.