Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఉహాగానాలపై స్పంచిందింది. శిఖర్ పహారియాతో పెళ్లి వార్తలు తెగ హల్చల్ చేస్తున్న వేళ.. ఈ వార్తలన్నింటికి చెక్ పెట్టింది. పెళ్లికి ఇంకా సమయం ఉందని.. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని స్పష్టం చేసింది. ఇటీవల ముంబయిలో జరిగిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా జాన్వీ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి జాన్వీ స్పందిస్తూ.. ‘ఇప్పుడంతా నా కెరీర్ మీదే ఫోకస్ ఉంది. పెళ్లికి సమయం ఉంది’ అంటూ బదులిచ్చింది. అయితే, శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్లో ఉన్నట్లుగా గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్‌తో జాన్వీ పలు ఈవెంట్లకు కలిసి రావడం, ఆమె ఫోన్ స్పీడ్ డయల్‌లో శిఖర్ పేరు ఉండడం, ‘శిఖు’ పేరుతో ఉన్న నెక్లెస్ ఆమె ధరించడంతో ప్రస్తుతం ఇద్దరు రిలేషన్లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి.
ఈ తాజా ఈవెంట్లో శిఖర్ పేరును ప్రస్తావించకపోయినా.. పెళ్లి వార్తలపై జాన్వీ ఓ క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమాలో జాన్వీ వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్నది. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. అలాగే, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో తెలుగులో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.