Jana Nayagan | తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన స్థాపించిన TVK పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో దక్షిణాది రాజకీయాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న జననాయగన్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మొదట ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, సెన్సార్ సంబంధిత సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ అడ్డంకులను స్వయంగా విజయ్ పరిష్కరిస్తున్నారని, త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
ఇక విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, సినిమాలో ఆయన పేరుకు ముందు ఉండే ‘దళపతి’ బిరుదును తొలగించి ‘ముఖ్యమంత్రి విజయ్’గా చూపించబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్స్‌లో మార్పులు చేస్తున్నారన్న వార్తలు అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే చిత్ర వర్గాలు ఈ వార్తలను పూర్తిగా ఖండించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేదని, విజయ్ పేరుకు ముందు ఎప్పటిలాగే ‘దళపతి’ టైటిల్‌నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషల్ మెసేజ్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా నటిస్తుండగా, బాబి డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.