Rajinikanth | రిలీజై మూడు వారాలు దగ్గరికొస్తున్నా ఇంకా కొన్ని చోట్ల జైలర్ హవానే నడుస్తుంది. పైగా జైలర్ తర్వాత ఇప్పటివరకు ఈ సినిమాకు ధీటుగా మరో సినిమా రాలేకపోయింది. కొత్త సినిమాలు ఎన్ని రిలీజవుతున్నా.. జైలర్ ముందు అవన్నీ జుజుబీలా అయిపోతున్నాయి. ఇక సూపర్ స్టార్ ర్యాంపేజ్ పాన్ ఇండియా లెవల్లో సాగుతుంది. ముఖ్యంగా సౌత్‌లో అన్ని రాష్ట్రాల్లో వీరవిహారం చేస్తున్నాడు. నిజానికి జైలర్ కథ మరీ గొప్పగా ఏమి ఉండదు. కేవలం రజనీ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ మ్యూజిక్.. ఈ రెండు సూపర్ హిట్ సినిమాను బంపర్ హిట్ చేసేశాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది.
జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ మార్క్ అందుకున్న రెండో సినిమాగా జైలర్ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది. రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్ 18రోజుల్లో సాధించింది. ఇక రజనీ పాత రికార్డులను తీసి మరీ వాటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తెలుగులో దాదాపు పుష్కరం కాలం తర్వాత రజనీ సినిమా ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమాకు తీసుకురాని ప్రాఫిట్స్ను జైలర్ సినిమా తీసుకొచ్చింది. తెలుగులో ఈ సినిమా రూ.75 కోట్ల రేంజ్లో గ్రాస్‌ను రాబట్టింది. ఇక కేరళ, కర్ణాటకలో రూ.50కు పైగా గ్రాస్‌ను సాధించింది.
తమిళనాడు ఒక్క రాష్ట్రంలోనే రూ.200 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టి రజనీ మేనియా ఏంటో చాటి చెప్పింది. హిందీ మార్కెట్లోనే కాస్త డల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ.. మిగితా అన్ని భాషల్లో జైలర్ విధ్వంసమే కొనసాగుతుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని నెల్సన్ చెప్పడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన జైలర్‌లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. వీళ్ల ఎంట్రీకి ఆడియెన్స్ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అయితే సంభవమే. గూస్బంప్స్ అనే పదం కూడా చిన్నదేనేమో అనే స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తంగా జైలర్‌తో సూపర్ స్టార్ సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు.