అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కాంతార – చాప్టర్ 1’ రేపు దసరాకు విడుదల కానుంది. దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్‌తో కథానాయకుడు రిషబ్‌శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీని ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 125కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత రిషబ్‌శెట్టి రెండు ప్రస్టేజియస్ ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ తెరకెక్కించనున్న ‘జై హనుమాన్’ వాటిలో ఒకటి కాగా, ఛత్రపతి శివాజీ బయోపిక్ రెండోది. వీటిలో ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం. దసరాకు ‘కాంతారా – చాప్టర్ 1’ విడుదల అవుతున్న సందర్భంలోనే ‘జై హనుమాన్’కు ప్రశాంత్‌వర్మ కొబ్బరికాయ కొట్టేయనున్నారట.
నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తున్నది. ‘హను-మాన్’ చిత్రాన్ని మించేలా ‘జై హనుమాన్’ ఉంటుందట. హాలీవుడ్ ‘అవేంజర్స్’ రేంజ్ కథ, కథనాలతో దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారట. ఊహించని అద్భుతాలు ఈ సినిమాలో ఉంటాయని, దేశం గర్వించే సినిమా అవుతుందని టీమ్ చెబుతున్నది. ఇందులో రిషబ్‌శెట్టి ఆంజనేయుడి పాత్ర పోషించనున్నారు. భారతచలనచిత్ర చరిత్రలో ఒక స్టార్ హీరో పూర్తిస్థాయిలో హనుమంతుడి పాత్ర పోషించడం ఇదే ప్రథమం. ఆ విధంగా రిషబ్ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారనే చెప్పాలి. వచ్చే ఏడాది చివర్లో ‘జై హనుమాన్’ విడుదలయ్యే అవకాశం ఉంది. మైత్రీ మూవీమేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.