Salaar Movie | పది రోజుల ముందు రిలీజైన సలార్ టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించింది. ఇరవై నాలుగ్గంటల్లో 83 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టి ఇండియాలో హైయెస్ట్ వ్యూవుడ్ టీజర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. కోడికూత వినకముందే సలార్ ఊచకోతను చూపించి ప్రభాస్ అభిమానులను ఆనందపు అంచుల్లో నిలబెట్టాడు ప్రశాంత్ నీల్. జురాసిక్ పార్కులో డైనోసర్ ముందు ఏదైనా దిగదుడుపే అన్న రేంజ్లో ప్రభాస్‌కు ఎలివేషన్ ఇవ్వడం వేరే లెవల్. ఒక్క టీజర్‌తో యావత్ సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ప్రభాస్ అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా జగపతి బాబు సలార్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తాజాగా జగ్గుబాయ్ ఓ ఇంటర్వూలో.. సలార్ సినిమాలో ప్రభాస్‌కు తనకు మధ్య ఒక్క సీన్ కూడా లేదని, సెకండ్ పార్ట్‌లో తమ మధ్య సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని చెప్పాడు. దాంతో సలార్ కోసం ఎదురు చూస్తున్న సినీ లవర్స్ పెద్ద అయోమయంలో పడిపోయారు. జగ్గూ బాయ్ మేయిన్ విలన్ కాకపోతే మరెవరై ఉంటారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్లో చూపించినట్లు పృథ్విరాజ్ విలన్ అయినా.. మేయిన్ విలన్ మాత్రం జగపతిబాబేనని ఇన్నాళ్లు అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు జగపతి బాబు కామెంట్స్ చూస్తుంటే మరో మేయిన్ విలన్ సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలోనూ జగపతిబాబు తాను కేవలం సలార్ కోసం ఐదు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నానని, అసలు స్టోరీ వినకుండానే సలార్‌ను ఓకే చేశానని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే సెకండ్ పార్టులో జగపతి బాబు పాత్ర కీలకం కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పృథ్విరాజ్, జగపతిబాబు తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ పాత్ర పోషించాడు. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్కు ప్రేక్షకుల నుంచి వీర లెవల్ రెస్పాన్స్ వచ్చింది.