‘రాజు వెడ్స్ రాంబాయి’ఫేం అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి కలిసి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకుడు శ్రీనివాస్ పాషన్ ఉన్న వ్యక్తి అనీ, 24శాఖలపై అవగాహన కలిగిన మంచి దర్శకుడని, చిన్న సినిమాలకు కొండంత భరోసానిస్తున్న నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉందని సమర్పకుడు కేఎల్ దామోదరప్రసాద్ అన్నారు. ‘దెయ్యాలను నమ్మని నేనే ఈ సినిమా చూసి భయపడ్డాను. చివరి పదిహేను నిమిషాలు థ్రిల్‌కు గురిచేస్తుంది. ఎవరి డబ్బులూ వృథా చేయని సినిమా ఇది. టికెట్ ధర కూడా రీజనబుల్‌గా ఉంటుంది. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు మాత్రం సినిమా చూడొద్దు’ అని బన్నీవాస్ అన్నారు.. ఇంకా వంశీ నందిపాటి, దర్శకుడు శ్రీనివాస్ మన్నె కూడా మాట్లాడారు.