Surender Reddy Next With Vaishnav Tej | సురేందర్ రెడ్డి.. ఏజెంట్ రిలీజ్ అయ్యే ముందు వరకు ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉండేంది. స్టైలిష్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరనేది ఇండస్ట్రీ పెద్దలే తీర్మానించారు. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన సందర్భాలున్నాయి. అయితే ఇదంతా ఏజెంట్ రాకముందటి ముచ్చట. రెండు నెలల కిందట వచ్చిన ఏజెంట్ ఎంతటి ఘోర పరాజయం పాలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండేళ్లు ఒళ్లూ హూనం చేసుకుని కష్టపడ్డ అఖిల్‌కు తన కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇక ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరు.. ఈ ఒక్క సినిమాతో కోల్పోయాడు సురేందర్ రెడ్డి.
ఈ సినిమా ఫలితం సురేందర్ రెడ్డి కెరీర్‌పై తీవ్రంగా చూపించింది. ఈ సినిమాలో ఆయన టేకింగ్‌కు విమర్శించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకొస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సురేందర్ రెడ్డి సైతం ఏజెంట్‌తో పోయిన పరువును ఎంత తొందరగా నిలబెట్టుకుంటే అంత బెటర్ అని ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ క్రమంలోనే ఓ హీరో సినిమాకు అంతా తానై దగ్గరుండి.. కేవలం దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరే వాళ్లకి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
సురేందర్ రెడ్డి తన మిత్రుడు టాగోర్ మధుతో కలిసి ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. దీనికి కథ, కథనం కూడా సురేందర్ రెడ్డి స్వయంగా అందిస్తున్నాడట. ఇక హీరోగా మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ను అనుకుంటున్నాడట. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అందుబాటులో ఉన్న హీరో వైష్ణవ్ ఒక్కడే. దాంతో సురేందర్ రెడ్డికి ఆప్షన్‌గా వైష్ణవ్ డేట్స్ దొరికినట్లు టాక్. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట సురేందర్ రెడ్డి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆదికేశవ సినిమా చేస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. జూలై విడుదల అంటూ ఇటీవలే రిలీజైన టీజర్లో ప్రకటించినా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో కాస్త లేటయ్యేలానే కనిపిస్తుంది.