Pushpa-2 Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప ది రైజ్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్కడి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయిపల్లవి కీలకపాత్ర పోషిస్తున్నట్లు ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. ఓ గిరిజన అమ్మాయి పాత్ర కోసం సాయిపల్లవిని చిత్రబృందం సంప్రదించినట్లు అందుకు సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెగ వార్తలు పుట్టుకొస్తున్నాయి. అంతేకాకుండా ఇందుకోసం సాయిపల్లవి 10రోజులు కాల్షీట్లు కూడా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని పలువురు టాలీవుడ్ సినీవిశ్లేషకులు తెలుపుతున్నారు. దాంతో పుష్పలో సాయిపల్లవి లేదని దాదాపుగా కన్ఫార్మ్ అయిపోయినట్లే.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప మూవీ రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.