Chiranjeevi | వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత అసలైన బ్లాక్బస్టర్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. 8 రోజుల్లోనే ఈ సినిమా రూ.104 కోట్ల షేర్ వసూలు చేసింది. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలైన కమ్ బ్యాక్ సినిమా ఇదే అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా అది కేవలం రీమేక్ సినిమా మాత్రమే. పైగా అందులో చిరంజీవి కాసేపు మాత్రమే కామెడీ చేస్తాడు.. మిగతాదంతా సోషల్ మెసేజ్ ఉంటుంది. కానీ వాల్తేరు వీరయ్యలో మాత్రం అలా కాదు ఎలాంటి సందేశాలు లేకుండా సినిమా అంతా ఫుల్ కమర్షియల్ క్యారెక్టర్లో కనిపించాడు. దాంతో ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫాన్స్.
ఇదిలా ఉంటే ఇకపై రీమేక్ సినిమాల జోలికి చిరంజీవి వెళ్లడు అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న భోళా శంకర్ తర్వాత పూర్తిగా స్ట్రెయిట్ సినిమాల మీద చిరంజీవి ఫోకస్ చేస్తాడని ప్రచారం జరుగుతున్న వేళ.. విశ్వాసం రీమేక్ లో మెగాస్టార్ నటించబోతున్నాడు అనే వార్త అభిమానులను కలవరపెడుతుంది.
ఇప్పుడే కదా ఒక స్ట్రైట్ సినిమాతో హిట్టు కొట్టావు బాసు.. అప్పుడే మళ్ళీ రీమేక్ వైపు ఎందుకు అడుగులు వేస్తున్నావు అంటూ సోషల్ మీడియాలో దాని గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మెగా ఫాన్స్. 2019లో అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం తెలుగులో వచ్చిన డాడీ, తులసి సినిమాలను కలిపి తీస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఉంటుంది. మళ్ళీ అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే వచ్చే లాభం ఏంటి అని చిరంజీవిని అడుగుతున్నారు అభిమానులు.
అయితే విశ్వాసం రీమేక్ విషయంలో ఎలాంటి నిజం లేదని.. అది కేవలం పుకారు మాత్రమే అని మెగా వర్గాలు కొట్టి పారేశాయి. కేవలం భోళా శంకర్ మాత్రమే చిరంజీవి చేస్తున్న సినిమా అని.. అది పూర్తయిన తర్వాత కానీ నెక్స్ట్ సినిమాల గురించి మెగాస్టార్ ఆలోచించడు అంటూ వాళ్లు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫ్లాప్ అయినా పర్లేదు కానీ స్ట్రెయిట్ సినిమాలు మాత్రమే చేయాలి.. రీమేక్ సినిమాలు మాత్రం మనకు అవసరం లేదు అంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు మెగా ఫాన్స్.
“Waltair Veerayya | మెగాస్టారా మజాకా.. రూ.200 కోట్ల క్లబ్లో వాల్తేరు వీరయ్య..!”