Kannappa | తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక మార్కెట్ ఉంటుంది. వాళ్ల మార్కెట్‌ను బట్టి సినిమా బడ్జెట్ అవుతుంది. నిర్మాతలు కూడా అవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత ఫలానా హీరోతో ఇంత బడ్జెట్లో సినిమా చేయాలి అనుకుంటారు. అయితే కొన్నిసార్లు హీరోలే నిర్మాతలు అయినప్పుడు.. వాళ్ల మార్కెట్ వాళ్లే పెంచుకోవాలని బడ్జెట్ కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మంచు విష్ణు అదే చేస్తున్నాడు. కెరీర్లో ఎప్పుడూ లేనంత బజ్ క్రియేట్ చేస్తూ కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నాడు ఈయన. అది కూడా ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా 150 కోట్లతో ఈ సినిమా వస్తోందని ఆయన చెప్పిన ప్రతిసారి.. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.. కానీ పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు మంచు విష్ణు. న్యూజిలాండ్‌లోనే సినిమా షూటింగ్ అంతా జరుగుతుంది. అక్కడే చాలా లావిష్ లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్. గతంలో భారీ పౌరాణిక సీరియల్స్ తెరకెక్కించిన అనుభవం ఉంది ఈయనకు. ఇలాంటి దర్శకుడిని నమ్ముకుని 150 కోట్లతో సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే కన్నప్ప సినిమా కోసం పెన్ను కూడా పడుతున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాకు ఆయన నటుడు మాత్రమే కాదు రైటర్ కూడా. ఆయన తెలుగు ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టు కథ స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నాడు. బడ్జెట్ విషయాల్లో కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, నయనతార, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు మంచు విష్ణు. ఇవన్నీ చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. అయితే ఎలా చూసుకున్నా కూడా మంచు విష్ణు సినిమాకు 150 కోట్లు బడ్జెట్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు అంటున్నారు కొందరు. కాకపోతే కన్నప్ప సినిమాతో తన రేంజ్ ఏంటో ప్రపంచంలో మొత్తం చూస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు మంచు వారబ్బాయి. ఇప్పటి వరకు ఈయన కెరీర్లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు మాత్రమే మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత విష్ణు కెరియర్ ఒక్కసారిగా పడిపోయింది.
మళ్లీ ఇప్పుడు తన కెరీర్ తానే నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. అందుకే భారీ బడ్జెట్ సినిమాతో వస్తున్నాడు. నవంబర్ 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా సినిమా కూడా ఇదే పాజిటివ్ యాంగిల్ లో ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. చాలా సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాడు. మరి ఆయన నమ్మకాన్ని కన్నప్ప ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.