Kamal Haasan | అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ ‘విక్రమ్’ తర్వాత కెరీర్లో స్పీడ్ పెంచారు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఆయన గురించిన ఓ తాజా కబురు ఒకటి నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. కమల్‌హాసన్ నటించనున్న ఓ ప్రాజెక్టు గురించి ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది. కమల్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
కమల్‌హాసన్ నటిస్తున్న 233 సినిమా ఇది. కమల్‌హాసన్‌ను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు వినోద్ పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా తమ బ్యానర్లో రానున్న సినిమాలను ఉద్దేశించి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తాజాగా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌తో ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. ‘థగ్‌లైఫ్’, ‘కమల్ 237’, ‘శివకార్తికేయన్ 21’, ‘శింబు 48’ త్వరలో తమ బ్యానర్ నుంచి విడుదల కానున్నట్లు పోస్టులో పేర్కొంది. ‘కమల్ 233’ ప్రాజెక్ట్ ఈ జాబితాలో లేకపోవడంతో అది ఆగిపోయిందని, అందుకే దాని ప్రస్తావన తాజా పోస్టులో లేదనే కథనాలు సోషల్ మీడియా, వెబ్సైట్లలో వెలువడుతున్నాయి.