చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. దానికి ముందు బిజినెస్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి ఆచార్య వరకు కూడా మెగాస్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ సినిమా బిజినెస్ మరో స్థాయిలో జరిగింది. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఒక నార్మల్ సినిమాకు ఏకంగా 145 కోట్ల బిజినెస్ చేశారు దర్శక నిర్మాతలు. కొరటాల శివ ట్రాక్ రికార్డు.. చిరంజీవి, రామ్ చరణ్ మొదటి సారి కలిసి నటించిన సినిమా కావడంతో ఆచార్య బిజినెస్ ఆకాశాన్ని దాటింది. అయితే అది ఊహించని విధంగా డిజాస్టర్ కావడం.. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 80 కోట్ల వరకు నష్టాలు రావడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఆ ప్రభావం గాడ్ ఫాదర్ సినిమాపై గట్టిగా పడిందని అర్థమవుతుంది.
ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ ఆచార్య కంటే దాదాపు 50 కోట్లు తక్కువగా జరిగింది. చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ సినిమాను తక్కువగానే అమ్మాలి అని తన నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. చాలా ఏరియాలలో చిరంజీవి రేంజ్ కంటే చాలా తక్కువ రేట్లకు గాడ్ ఫాదర్ సినిమాను అమ్మారు. ఉదాహరణకు నైజాం మార్కెట్ తీసుకుంటే ఇక్కడ మెగాస్టార్ సినిమా హిట్ అయింది అంటే.. కనీసం 40 కోట్లు వస్తాయి. కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ హక్కులను కేవలం 25 కోట్లకు మాత్రమే దక్కించుకుంది ఏషియన్ ఫిలిమ్స్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్లకు పండగే పండగ.
ఎందుకంటే చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఆంధ్ర, సీడెడ్ కూడా కేవలం 50 కోట్లకు మాత్రమే అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 84 కోట్లకు మించలేదు అని తెలుస్తోంది. ఐదేళ్ల కింద చిరంజీవి ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు అప్పట్లోనే 90 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ తర్వాత సైరా 187 కోట్ల బిజినెస్ చేసింది.. మొన్నటికి మొన్న ఆచార్య 140 కోట్లకు కొన్నారు. కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ మాత్రం కేవలం 85 కోట్ల లోపు బిజినెస్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఏదేమైనా ముందు సినిమా డిజాస్టర్ అయినప్పుడు ఎంత పెద్ద హీరో అయినా తర్వాత సినిమా విషయంలో తగ్గాల్సిందే అని చిరంజీవి నిరూపించాడు. దీనికి పాజిటివ్ టాక్ వస్తే సేఫ్ అవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లకు ఎంత సమయం పట్టదు. కేవలం వారం రోజుల్లోనే మొత్తం వెనక్కి లాగేస్తాడు చిరంజీవి. తద్వారా ఆచార్య నష్టాలు కొంతైనా భర్తీ చేయాలని భావిస్తున్నాడు మెగాస్టార్. కానీ ఇదంతా పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అక్టోబర్ 5న దసరా కానుకగా గాడ్ ఫాదర్ విడుదల కానుంది.