‘సినిమా చాలా బలమైన మాధ్యమం. రెండు గంటల్లో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు’ అన్నారు యువ హీరో విశ్వదేవ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘35-చిన్నకథ కాదు’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నివేదా థామస్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా శుక్రవారం హీరో విశ్వదేవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకులు, సినీ విమర్శకులు డిస్టింక్షన్ మార్కులు వేశారు.
కెరీర్ ఆరంభంలో తండ్రి పాత్ర చేస్తున్నాను కాబట్టి ఆ తర్వాత అవకాశాల విషయంలో ఇబ్బంది అవుతుందని ఏ మాత్రం ఆలోచించలేదు. ఓ సవాలుగా తీసుకొని ఈ క్యారెక్టర్ చేశాను. ఇమేజ్ పట్టింపులు లేకుండా ప్రతీ సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నా’ అన్నారు. సినిమాలో తాను పోషించిన ప్రసాద్ పాత్ర అందరికి కనెక్ట్ అవుతున్నదని, కథ విన్నప్పుడే సినిమా చేయాలని ఫిక్సై పోయానని విశ్వదేవ్ పేర్కొన్నారు.
కెరీర్ ఆరంభం నుంచి కథల విషయంలో కొత్తదనానికే ప్రాధాన్యతనిస్తున్నానని, తన కెరీర్లో అదిరిపోయిందనిపించిన సినిమా మాత్రం ఇదేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలోని బలమైన కుటుంబ బంధాలు మనసుల్ని కదిలిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని విశ్వదేవ్ అన్నారు.