పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఆది పురుష్’. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఈ సినిమా గతేడాది చివరలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత భూషణ్ కుమార్. ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో ‘ఆది పురుష్’ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం 20 వేల స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శనకు రానుంది. ఓ ప్రముఖ హాలీవుడ్ పంపిణీ సంస్థతో ఆదిపురుష్ సినిమా విడుదల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మహా విడుదలతో ప్రభాస్ చరిత్ర సృష్టించడం ఖాయం.