కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిస్తారు యువహీరో వరుణ్‌తేజ్. యాక్షన్ మొదలుకొని కామెడీ వరకు ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతారు. ‘నటుడిగా వైవిధ్యాన్ని కనబరచాలి. ఎలాంటి క్యారెక్టర్‌కైనా పరిపూర్ణంగా న్యాయం చేయాలన్నది నా సిద్ధాంతం’ అని అంటున్నారు వరుణ్‌తేజ్. ఆయన వెంకటేష్‌తో కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా శుక్రవారం వరుణ్‌తేజ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
‘ఎఫ్-2’ చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్ చేయాలనుకున్నాం. దర్శకుడు అనిల్ రావిపూడి డబ్బు నేపథ్యంలో కథ ఉంటుందని చెప్పి..రెండుమూడు సీన్స్ వివరించారు. సెట్లోనే అందరం నవ్వుకున్నాం. సీక్వెల్‌కు సంబంధించిన బాధ్యత మొత్తం దర్శకుడు అనిల్ తీసుకున్నారు. మా టీమ్ మొత్తానికి ఆయన మీద మంచి నమ్మకం కుదిరింది. ‘ఎఫ్-2’కి మించి మూడింతల వినోదంతో ప్రేక్షకులకు నవ్వుల్ని పంచుతుందీ చిత్రం. సినిమా మొత్తం ఓ నవ్వుల పండగలా ఉంటుంది.
ఫైట్స్, యాక్షన్ కంటే కామెడీ చేసి మెప్పించడం చాలా కష్టమైన పని. సినిమాలో వినోదపు మోతాదు పెంచడానికి దర్శకుడు అనిల్ నత్తి క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్‌గారు రేచీకటితో, నేను నత్తితో బాధపడుతుంటాం. మేమిద్దరం ఓ రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకరికి కనబడదు..మరొకరు మాట సరిగ్గా పలకలేడు. ఇలాంటి సీన్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. నత్తి విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి హోమ్‌వర్క్ చేయలేదు. దర్శకుడు అనిల్ ప్రతి సీన్‌ను నటించి చూపించేవారు. నేను ఆయన్ని ఫాలో అయిపోయా.
ఈ సినిమాలో ప్రతి ఒక్కరు డబ్బుని అమితంగా ప్రేమిస్తారు. మనీ కోసం వారు పడే ఫ్రస్ట్రేషన్ నుంచి కామెడీ పుడుతుంది. మరో విషయం ఏమిటంటే..‘ఎఫ్-2’లోని క్యారెక్టర్స్ మాత్రమే సీక్వెల్లో కొనసాగుతాయి. కథ మొత్తం వేరుగా ఉంటుంది. అందుకే ‘ఎఫ్-2’ చూడని వారు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.
ఓ నటుడిగా మాత్రమే కాదు..వ్యక్తిగతంగా కూడా నేను వెంకటేష్‌గారిని ఎంతగానో అభిమానిస్తాను. ఓ అన్నయ్య, తండ్రిలా భావిస్తాను. ఆయనలోని క్రమశిక్షణ బాగా నచ్చింది. అనుకున్న టైమ్‌కు సెట్‌కు వస్తారు. ఆయన్ని చూసి నేను ఐదు నిమిషాలు ముందే సెట్లో ఉండేవాడిని. వెంకటేష్గారిలో ఆధ్యాత్మిక భావాలు ఎంత గొప్పగా ఉంటాయో..అదే స్థాయిలో చక్కటి హాస్యచతురత కూడా కనిపిస్తుంది.
ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఇది. కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లాలంటే ఆర్థికంగా భారంగానే ఉంటుంది. అందుకే అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లను విక్రయించాలని నిర్మాత దిల్‌రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా ప్రేక్షకులపై భారాన్ని తగ్గిస్తుంది.
ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకమని భావిస్తా. కొన్ని పాత్రలు సులభంగా అనిపిస్తాయి. మరికొన్ని కష్టంగా ఉంటాయి. ఏ సినిమా చేసినా నా పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయాలని తపిస్తాను. వ్యక్తిగతంగా ‘కంచె’ సినిమాలో చేసిన పాత్ర గొప్ప సంతృప్తినిచ్చింది.
హీరోలు కథల్ని ఎంచుకునే విధానం మారడానికి పాన్ ఇండియా కారణం కాదు..ఓటీటీ ప్రభావంతో కథల్లో వైవిధ్యం కోసం చూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ ఇవ్వడం ఓ సవాలుగా మారింది. ఈ ధోరణి మంచిదే అనుకుంటున్నా. కొత్త కథలతో సినిమాలొచ్చే అవకాశం ఇప్పుడు ఎక్కువైంది.
కాలేజీ రోజుల్లో ఆ సమస్య ఉండేది. సినిమాకు వెళ్తానంటే నాన్న యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అవి అస్సలు సరిపోయేవి కావు (నవ్వుతూ). మా ఫ్రెండ్స్ డబ్బులు సర్దేవారు. ఆ టైమ్‌లో డబ్బు లేకుంటే ఉండే కష్టాలేమిటో ప్రత్యక్షంగా తెలుసుకున్నా. ఇక నా దృష్టిలో సులభంగా సంపాదించిన డబ్బు అంత సులభంగానే పోతుంది. మనదగ్గర ఎంత ఉన్నప్పటికీ డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి. ఇదే విషయాన్ని ‘ఎఫ్-3’లో చెప్పాం.