సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ అనగానే ముందు అందరికీ క్యామియోలే గుర్తొస్తున్నాయి. ‘జైలర్’లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ప్రత్యేకపాత్రల్లో కనిపించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘జైలర్ 2’లో మరిన్ని క్యామియోలు ఉంటాయని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇందులో ఓ కీలకమైన క్యామియో రోల్‌కి నందమూరి బాలకృష్ణను అడిగారు నెల్సన్. బిజీ కారణం చేత ఆయన ఆ రోల్‌ని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ఆ రోల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ నటిస్తారని వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా ఆ రోల్‌ని బాలీవుడ్ టాప్‌హీరో హృతిక్‌రోషన్ పోషిస్తున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. 40ఏండ్ల క్రితం రజనీకాంత్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘భగవాన్ దాదా’లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు హృతిక్. ఇప్పుడు అదే రజనీ సినిమాలో గెస్ట్‌గా నటించనుండటం నిజంగా విశేషమే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.