Saba Azad hospitalized | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి మరియు గాయని సబా ఆజాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కడుపుపై ప్రభావం చూపే ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ (Cyclospora cayetanensis) అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్ (Parasitic Infection) సోకడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ, తన జీవితంలోనే ఇవి అత్యంత భయంకరమైన 14 రోజులు అని పేర్కొన్నారు.
తన ప్రియుడు, నటుడు హృతిక్ రోషన్ తీసిన ఆసుపత్రి ఫోటోను షేర్ చేస్తూ.. “నా జీవితంలోనే అత్యంత దారుణమైన 14 రోజులు ఇవి. ఎప్పుడూ ఇంటి ఆహారాన్నే తింటూ, బయటకు వెళ్లినప్పుడు సొంత వాటర్ బాటిల్‌నే తీసుకెళ్లే నాకు, ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావడం లేదు. ఏడాదిలో నేను అత్యంత బిజీగా ఉండే సమయంలో ఇది నన్ను దెబ్బతీసింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయాను. ఇప్పుడు కనీసం నడవడానికి కూడా ఓపిక లేదు అంటూ సబా రాసుకొచ్చారు.
మరోవైపు తన ఫిట్నెస్ గురించి ప్రస్తావిస్తూ.. ఒక రోజు నేను రోజుకు రెండుసార్లు వర్కౌట్లు చేస్తూ, భారీ బరువులు ఎత్తేదాన్ని. కానీ మరుసటి రోజే సగం మనిషిని అయిపోయాను. కనీసం ఒక టూత్‌పిక్ ఎత్తేంత శక్తి కూడా నాలో లేదు. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యం కోసం కూరగాయలు, ఆకుకూరలను చాలా శుభ్రంగా కడగండి. కొన్నిసార్లు మీ ప్రాణం వాటిపైనే ఆధారపడి ఉంటుంది అని సబా ఆజాద్ హెచ్చరించారు. ఇక ఈ వార్త తెలియగానే హృతిక్ రోషన్ అభిమానులు మరియు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా హృతిక్ రోషన్‌తో రిలేషన్షిప్లో ఉంటూ వార్తల్లో నిలుస్తున్న సబా, తన అనారోగ్యం గురించి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.