Bhari | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతున్న కొత్త చిత్రం శనివారం ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టి సినిమాకు శ్రీకారం చుట్టారు. అన్నయ్య హీరోగా, చెల్లెలు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బరి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. “ఇక బరిలో దూకుదామా?” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ పోస్టర్ ఇప్పటికే మంచి హైప్‌ను సృష్టిస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు. తన కెరీర్లో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన వరుణ్, ఈ సినిమాలో మరో కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’తో గుర్తింపు పొందిన యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మాతగా నిహారిక ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌ను స్థాపించి ముందుగా యూట్యూబ్, వెబ్ సిరీస్‌లతో ప్రారంభించి, ‘కమిటీ కుర్రోళ్లు’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే హారర్ ఫాంటసీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నారు.ఎప్పటి నుంచో వరుణ్ తేజ్‌తో సినిమా నిర్మించాలని భావించిన నిహారిక, ఇప్పుడు ఆ కలను నిజం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ సమక్షంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొత్తానికి, ‘బరి’ సినిమాతో వరుణ్ తేజ్–నిహారిక కాంబో సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండటం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఇటు వరుణ్ తేజ్‌కి, అటు నిహారికకి చాలా ఇంపార్టెంట్. పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, కుస్తీ యోధుడిగా కనిపించి అలరించనుండగా, బరిలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్‌గా సందడి చేయబోతున్నారు.