Dhurandhar: The Revenge | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, గతంలో ఉన్న ‘పఠాన్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాల రికార్డులను సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రణ్వీర్, తాజాగా తన భార్య దీపికా పదుకోన్‌తో కలిసి ముంబైలో చిల్ అవుట్ అవుతూ కనిపించారు.
ఈ క్రమంలో ముంబై చౌపాటీలోని ‘బెన్నె’ అనే ప్రసిద్ధ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఈ జంట, అక్కడ సాధారణ వ్యక్తుల్లాగే దోసలను ఆస్వాదించారు. నలుపు రంగు టీ-షర్ట్, తెల్లటి క్యాప్ ధరించిన రణ్వీర్ మరియు బ్లాక్ టీ-షర్ట్‌లో మెరిసిన దీపికాల సింపుల్ లుక్ సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షించింది. రణ్వీర్ తండ్రి జగ్జీత్ సింగ్ భవ్నానీ కూడా వారితో కలిసి ఉండగా, రెస్టారెంట్ సిబ్బందితో దిగిన వీరి సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఒకవైపు కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకుంటూనే, మరోవైపు కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్న ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.