జానపద దైవిక విశ్వాసాలు, అడవి బిడ్డల అస్తిత్వ పోరాటం నేపథ్యంలో రూపొందిన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. సెప్టెంబర్ 30న కన్నడంలో, అక్టోబర్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో ప్రదర్శింపబడుతున్నది. హిందీలో కూడా వసూళ్ల్ల జోరు కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం. అయితే ‘కాంతార’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల 4న ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. సినిమాకొస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ నెల 18 వరకు ఓటీటీ రిలీజ్‌ను పొడిగించారనే వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే ‘కాంతార’ ఓటీటీలోకి రానుందని తెలిసింది. అన్ని భాషల్లో కలెక్షన్స్ స్టడీగా ఉండటంతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓటీటీ రిలీజ్ విషయంలో తొందరపడకూడదని నిర్ణయించుకుందట. ప్రపంచవ్యాప్తంగా 400కోట్లు దాటిన తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించబోతున్నారని తెలిసింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.