Hit 3 | నేచురల్ నాని వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. అయితే ఇటీవల నాని ప్రధాన పాత్రలో రూపొందిన హిట్ 3 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్ కు మాత్రం హిట్ 3 చిత్రం మాంచి కిక్ ఇచ్చింది. వంద కోట్ల కలెక్షన్స్ అవలీలగా దాటి అందరిని అబ్బురపరిచింది.
ఇక ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. హిట్ 3 రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో రాబోతోంది. మే 29 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. హిట్ 3 కోసం ఎదురు చూస్తున్న వారు మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ మూవీని ఇంట్లో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా అడివి శేష్, కార్తీలు సాలిడ్ క్యామియో పాత్రల్లో నటించారు.
హిట్-3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. నాని, శైలేష్ కొలను కాంబోలో హిట్ 3 చిత్రం మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టాక్‌తో సంబంధం లేకుండా హిట్ 3 సినిమాకు మంచి కలెక్షన్లు అయితే వచ్చాయి. థియేటర్లో అదరగొట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. దసరా, సరిపోదా శనివారం సినిమాల హిట్స్‌తో దూకుడు మీదున్న నాని హిట్ 3తో తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేశాడు. శైలేష్ కొలను శ్రీకారం చుట్టిన హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ కేస్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద హిట్ 3 మెరుగైన ప్రదర్శన చేసింది.