Homebound Movie At Cannes | ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో భారతీయ సినిమా తన సత్తాను చాటింది. ఈ ఏడాది కేన్స్‌లో ప్రదర్శితమైన ఏకైక భారతీయ చిత్రంగా నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ నిలిచింది. ఈ చిత్రం ప్రదర్శన అనంతరం ఏకంగా 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఈ అద్భుతమైన స్పందనతో దర్శకుడు నీరజ్ ఘైవాన్, నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగానికి లోనయ్యారు. వారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి.
‘హోమ్‌బౌండ్’ చిత్రం ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ప్రీమియర్ అయ్యింది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ అపూర్వ గౌరవం భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచ వేదికపై నిలబెట్టింది.
Historic! #Homebound gets a 9-minute standing ovation at the #Cannes premier. #KaranJohar and #NeerajGhaywan couldn’t control their emotions #MovieTalkies pic.twitter.com/hqc61eS16C
— MovieTalkies.com (@MovieTalkies) May 21, 2025
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చందన్ కుమార్ (విశాల్ జేత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ ఖత్తర్) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితాల కథ ఆధారంగా వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వీరిద్దరూ మంచి జీవితం కోసం ఆరాటపడుతుంటారు. వారికి సమాజంలో ఎదురయ్యే వివక్ష, పేదరికం నుండి బయటపడటానికి, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. పోలీసు విభాగంలో 2.5 మిలియన్ల మంది దరఖాస్తుదారులలో కేవలం 3,500 మంది మాత్రమే ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ, యూనిఫాం ధరించి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కలలు కంటారు.
వారిద్దరి మత, సామాజిక నేపథ్యాలు వేరైనా, వారి స్నేహం చాలా బలమైనది. ఆచరణాత్మక ఆలోచనలు కలిగిన చందన్, కోపంగా ఉండే మహ్మద్‌ను ఇబ్బందుల నుండి కాపాడుతుంటాడు. అయితే, వారి స్నేహం ఒక పరీక్షకు గురవుతుంది. చందన్ పరీక్షలో ఉత్తీర్ణుడైతే, మహ్మద్ విఫలమవుతాడు. చందన్ తన ఉద్యోగ నియామకం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, మహ్మద్ ఒక ఎలక్ట్రానిక్స్ డీలర్ వద్ద పనిలో చేరి, తన హిందూ సహోద్యోగుల గౌరవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు.
2020లో కోవిడ్-19 విజృంభించి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయానికి, ఈ ఇద్దరు యువకుల జీవితాలు విడిపోయి, మళ్లీ కలుసుకుంటాయి. ఈ ప్రయాణంలో, వారి స్నేహం, ఆశలు, నిరాశలు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత పోరాటాలు వంటి అనేక అంశాలను దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరపై చూపించాడు. అట్టడుగు వర్గాల ప్రజలు గౌరవంగా, ఆనందంగా జీవించడానికి పడే కష్టాలను ఈ చిత్రం ఎంతో సున్నితంగా, వాస్తవికంగా చిత్రీకరించింది. జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర కూడా కథలో కీలకమైనది.