‘ఈ కథపై నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్నా. ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పిన అనుభవాలతో స్క్రిప్ట్ సిద్ధం చేశాం. పోలీసులందరూ గర్వించేలా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు ఆర్కే సాగర్. ఆయన హీరోగా నటిస్తున్న ‘ది 100’ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది. రాఘవ్ ఓంకార్ దర్శకుడు. బుధవారం ఆర్కేసాగర్ పాత్రికేయులతో ముచ్చటించారు. సమాజాన్ని రక్షించే ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని, చక్కటి సందేశం ఉంటుందన్నారు.
‘హై ఇంటెన్సిటీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. క్రైమ్ ఎలిమెంట్స్‌తో పాటు ఇందులో హృదయాన్ని కదిలించే ఎమోషనల్ డ్రామా ఉంటుంది’ అని ఆర్కే సాగర్ చెప్పారు. ‘మొగలిరేకులు’ సీరియల్లో ఆర్.కె.నాయుడు పాత్ర తనకు బాగా గుర్తింపు నిచ్చిందని, దాదాపు ఆరేళ్లు ఆ పాత్రతో ప్రయాణం చేశానని, నటుడిగా విభిన్నమైన పాత్రలు చేయాలనే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నానని ఆయన తెలిపారు.