Tollywood Hits 2023 | పెద్ద సినిమాలు వచ్చినపుడు ఉండే హంగామా వేరు. వాటికోసం వేలాది థియేటర్లు వేచి చూస్తుంటాయి.. కోట్లాది మంది అభిమానులు కూడా వేచి చూస్తుంటారు. కానీ చిన్న సినిమాలకు అలా కాదు. వాటికి బాగుంది అనే టాక్ వస్తే తప్ప.. థియేటర్స్ వరకు రావడానికి ఆడియన్స్‌కు మనసు రాదు. 2023లో అలాంటి చిన్న సినిమాలు చాలానే విజయం సాధించాయి. ముఖ్యంగా అసలు వస్తున్నట్లు కూడా తెలియని సినిమాలు.. వచ్చిన తర్వాత అద్భుతాలు చేసాయి. 2023లో చిన్న సినిమాలే ప్రతీసారి ఇండస్ట్రీని ఆదుకున్నాయి. సీజన్లో కనీసం ఒక్క చిన్న సినిమా అయినా సంచలనం సృష్టించింది. అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి అవేంటో.. 2023ను సర్ప్రైజ్ చేసిన విజయాలేంటో చూద్దాం.
కొన్ని సినిమాలు హీరోల కోసం.. మరికొన్ని దర్శకుల కోసం చూస్తుంటారు ఆడియన్స్. కానీ చిన్న సినిమాలకు ఆ ఆప్షన్ ఉండదు. అందులో కథ బలంగా ఉన్నపుడే కాసులొస్తాయి. అలా వచ్చిన సినిమానే బలగం. 2023లో ఫస్ట్ సర్ప్రైజింగ్ బ్లాక్‌బస్టర్ ఇది. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అయింది. 2 కోట్లతో తెరకెక్కి 12 కోట్ల వరకు వసూలు చేసింది బలగం.
సమ్మర్లో పెద్ద సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్లు పోతుంటే.. థియేటర్స్ దగ్గర కాస్త సందడి చేసిన సినిమా సామజవరగమనా. శ్రీ విష్ణు కెరీర్‌కు కావాల్సినంత బూస్టప్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమా దాదాపు 50 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది.
2023లో చిన్న సినిమాలు ఎన్ని వచ్చినా.. అన్నింట్లోనూ అదిరిపోయిన సినిమా అంటే బేబీనే. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 14న విడుదలైంది. బేబీ సృష్తించిన సంచలనం మామూలుగా లేదు. దీని రీసౌండ్ నెల రోజుల వరకు వినిపించింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 90 కోట్లకు పైగా వసూలు చేసింది బేబీ. యూత్‌కు 30 రోజులు నిద్ర లేకుండా చేసింది బేబీ సినిమా. ఈ సినిమాతోనే వైష్ణవి చైతన్య క్రేజీ హీరోయిన్ అయిపోయింది.
కాలేజ్ నేపథ్యంలో వచ్చిన మ్యాడ్ కూడా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కొత్త వాళ్లతో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. అంచనాలు లేకుండా వచ్చిన పెద్ద సంచలనమే రేపింది మ్యాడ్ మూవీ. 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం.
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన మా ఊరి పొలిమేర కరోనా సమయంలో ఓటిటిలో విడుదలై విజయం సాధించింది. దీనికి సీక్వెల్ 2023లో వచ్చింది. ఈ సారి థియేటర్స్‌లోకి వచ్చి విజయం సాధించింది మా ఊరి పొలిమేర 2. ఈ ఏడాది సర్ప్రైజింగ్ హిట్స్‌లో ఇది కూడా ఒకటి.
ఇవి మాత్రమే కాదు.. అజయ్ భూపతి మంగళవారం, సముద్రఖని హీరోగా నటించిన విమానం లాంటి చిన్న సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చింది. అవి కూడా బాగానే మ్యాజిక్ చేసాయి.