అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పకుడు. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది. బన్నీవాస్, వంశీ నందిపాటి సినిమాను విడుదల చేస్తున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ సక్సెస్‌మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాలవల్ల ఈ నెల 25కి వాయిదా వేశాం. మేం భయపెట్టడం లేట్ అవ్వొచ్చేమో కానీ, భయపెట్టడం మాత్రం కన్ఫామ్.
సినిమా చూసి రాత్రి పూట ఆంజనేయ దండకం చదువుకుంటారు.’ అని బన్నీవాస్, వంశీ నందిపాటి నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ విజయం దక్కాలని సమర్పకుడు కేఎల్ దామోదరప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందని హీరో త్రిగుణ్ అన్నారు.
‘ఈషా’ సినిమా ఓ అద్భుతమంటూ హెబ్బా పటేల్ కొనియాడారు. దర్శకుడు మంచి కథతో ఈ సినిమాను మలిచాడని నిర్మాత హేమ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంకా దర్శకుడు శ్రీనివాస్ మన్నె, సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్, డీవోపీ సంతోష్ కూడా మాట్లాడారు.