Harshvardhan Rane | హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ చుట్టూ అభిమానులు గుమిగూడిన తీరు, షాప్ లాంచ్ సందర్భంగా సమంతను జనాలు చుట్టుముట్టిన ఘటనలు ఇంకా మరవక ముందే, ఉత్తరాదిలో ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. హిందీ సినిమా ఓటీటీ ప్రమోషన్లలో భాగంగా హీరో హర్షవర్ధన్ రాణే అభిమానుల చేతిలో చిక్కుకుని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ సినిమా ప్రమోషన్ల సమయంలో అభిమానులు ఆయనను చుట్టుముట్టి చొక్కా కూడా చింపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ కనిపించింది.
‘సయ్యారా’, ‘ఏక్ దీవానే కి దీవానియత్’, ‘తేరే ఇష్క్ మే’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఈ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ డిసెంబర్ 16 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం హీరో హర్షవర్ధన్ రాణే ప్రజల మధ్యకు వెళ్లగా, అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముంబై బాంద్రాలోని బస్ స్టాండ్ వద్ద డిజిటల్ రిలీజ్ ప్రమోషన్ చేస్తుండగా, హర్షవర్ధన్ రాణే కారులో నుంచి దిగగానే అభిమానులు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. ఈ గందరగోళంలో కొందరు అభిమానులు అతని చొక్కాను లాగడంతో అది చినిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ, అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇదే తరహా ఘటనలు ఇటీవల దక్షిణాదిలోనూ చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘ది రాజా సాబ్’ ప్రమోషనల్ ఈవెంట్లో నిధి అగర్వాల్‌ను అభిమానులు చుట్టుముట్టడంతో ఆమె కారులోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడింది. అంతేకాదు, సమంత రూత్ ప్రభు కూడా ఓ షాప్ లాంచ్ సందర్భంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనలు అభిమానుల ఉత్సాహం ఎక్కడ హద్దులు దాటుతోందన్న చర్చకు దారి తీస్తున్నాయి. హర్షవర్ధన్ రాణే కెరీర్ విషయానికి వస్తే, ఈ ఏడాది ఆయనకు బాగా కలిసి వచ్చింది. 2016లో విడుదలైన ‘సనమ్ తేరి కసమ్’ ఈ ఏడాది రీ-రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధించింది. తాజాగా ‘ఏక్ దీవానే కి దీవానియత్’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక రాబోయే రోజుల్లో హర్షవర్ధన్ ‘సిలా’, ‘కున్ ఫాయా కున్’, ‘ఫోర్స్ 3’ వంటి చిత్రాల్లో నటించనుండగా, అభిమానుల క్రేజ్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే ఈ క్రేజ్ స్టార్స్ భద్రతకు ముప్పుగా మారకుండా ఉండాలన్నదే ఇప్పుడు అందరి అభిప్రాయంగా మారింది.