Hari Hara Veeramallu | దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మూవీ హరిహర వీరమల్లు కాగా, ఈ చిత్రం కోసం ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకి జులై 24న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రాత్రి ప్రీమియర్ షోస్ కూడా వేశారు. ప్రస్తుతం బెనిఫిట్ షోస్ నడుస్తున్నాయి. పలు ప్రదర్శనలతో అభిమానుల ఉత్సాహం తారా స్థాయికి చేరుకుంది. కాకినాడ, పిఠాపురం, తుని, అమలాపురం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద పవన్ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. “బాబులకు బాబు.. కళ్యాణ్ బాబు!” అంటూ నినాదాలతో ఆ ప్రాంతాలు మార్మోగాయి.ఫ్యాన్స్ మాత్రమే కాదు, స్థానిక యువత కూడా థియేటర్ ప్రాంగణాల్లో కటౌట్లకు పాలాభిషేకాలు, హారతులు చేసి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.
థియేటర్ బయట జనం గుమిగూడడంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులలో ట్రాఫిక్ జామ్ అయింది.జులై 23వ తేదీ రాత్రి 9 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రాత్రంతా వేచిచూసిన అభిమానుల ఆనందం అవధులు దాటింది. కొందరు మీడియాతో తమ అభిప్రాయాన్ని పంచుకోగా, మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. చారిత్రక కథను డైరెక్టర్లిద్దరూ బాగా చూపించారని చెప్పుకొస్తున్నారు. సినిమా తమకు ఎక్కడా బోర్ కొట్టలేదని.. కీరవాణి మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలెట్ అని అంటున్నారు.. పార్ట్1లో ప్రతీ క్యారెక్టర్ని కూడా మొదటి నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా డిజైన్ చేసి చూపించారని, పార్ట్ 2లో ఈ పాత్రలకి సంబంధించి ప్రతీదానికి వివరణ ఉంటుందని అంటున్నారు.
పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయినట్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో, అభిమానులు థియేటర్ వద్ద హారతులు, పాలాభిషేకాలు చేయడంతో పాటు తమ అభిమాన హీరోకు దిష్టి తీయాలని ప్రత్యేక పూజలు చేశారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, స్థానిక ప్రజలూ ఈ వేడుకల్లో భాగమవుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చారిత్రక చిత్రానికి పవన్ కళ్యాణ్ లాంటి నటుడే తగిన వాడు. ఈ పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ పోషించలేరు అని కొనియాడుతున్నారు. సమాజానికి మంచి సందేశం అందించేలా చిత్రాన్ని రూపొందించినందుకు కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.