Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, చిత్రంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సినిమా కథ చరిత్రను వక్రీకరిస్తోందంటూ తెలంగాణ బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ .. చరిత్రలో కనిపించని కథలను మిక్స్ చేసి, ప్రజలని తప్పుదారి పట్టేలా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది నిజానికి తెలంగాణ పోరాట వీరుడు పండుగ సాయన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించిన సినిమా. కానీ దర్శక, నిర్మాతలు ఇది హరి హర రాయలు,బుక్క రాయల కథ అని చెబుతున్నారు. నిజానికి ఇది చరిత్రతో అస్సలు సంబంధం లేని కల్పిత కధ.
హరి హర రాయలు కాలం (1336-1406) లో ఉండగా, ఔరంగజేబు (1658-1707) మధ్య 300 ఏళ్ల తేడా ఉంది. అయినా సినిమా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఔరంగజేబుతో పోరాడినట్లు చూపించారు. ఇది ఎలా సాధ్యం చార్మినార్ కూలీ కుతుబ్ షా ద్వారా 1591లో నిర్మించబడింది. కానీ సినిమాలో ఇది కూడా హరి హర రాయల సమకాలీనంగా చూపించారు. ఈ విషయంలో 200 ఏళ్ల గ్యాప్ ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కోహినూర్ వజ్రంను హరి హర వీరమల్లు ఔరంగజేబు నుండి తిరిగి తీసుకున్నట్లు చూపించడమూ చరిత్రలో ఎక్కడా కనిపించదు. పండుగ సాయన్న నిజ జీవితానికి ఆధారంగా సినిమా తీసి ఉంటే, సరైన పరిశోధన చేసి, నిజ చరిత్రను చెప్పాలి. కానీ ఇందులో పండుగ సాయన్న పాత్రను మార్చి, కల్పితమైన హరి హర వీరమల్లు అనే పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ సినిమాలో ఇలా నటించడం వల్ల తప్పుడు చరిత్ర ప్రజల్లో నాటుకుపోతుంది. భవిష్యత్తులో నిజమైన చరిత్రను ఎవరు సినిమాగా తీసినా నమ్మకపోయే ప్రమాదం ఉంది అని అన్నారు. ఇక ఈ సినిమాను అడ్డుకోవడానికి హైకోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు బీసీ సంఘాల నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ మాకు శత్రువు కాదు. ఆయనపై మాకు గౌరవం ఉంది. కానీ ఈ చిత్రాన్ని తక్షణం నిలిపివేయాలి. చరిత్రను వక్రీకరించడాన్ని సహించం. పండుగ సాయన్న జీవితాన్ని అపహాస్యం చేయకూడదు అంటూ స్పష్టం చేశారు. మరి దీనిపై చిత్ర బృందం ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.