సరోగసీ, డ్రగ్ మాఫియా నేపథ్యంతో సమంత ప్రధాన పాత్రలో ‘యశోద’ అనే చిత్రాన్ని రూపొందించారు దర్శకద్వయం హరి, హరీష్. ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ…‘కొన్ని పత్రికల్లోని వార్తల ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నాం. వాస్తవ ఘటనలకు, కాల్పనికత జోడించాం. నాయికగా సమంత తప్ప మరెవరినీ ఊహించుకోలేదు. ఆమెకు కథ చెప్పినప్పుడు ఉద్వేగపూరితంగా ఉంది, నేను నటిస్తానని అంది. చిత్రీకరణ మొత్తంలో ఆమె అంకితభావం, ఇన్వాల్వ్మెంట్ చూపించారు. ప్రతి చిన్న విషయంపైనా శ్రద్ధ వహించారు. ఆమె దర్శకత్వ విభాగంలో జోక్యం చేసుకుందనేది అవాస్తవం. జ్వరం ఉన్నా మాకు చెప్పకుండా వచ్చి షూటింగ్లో పాల్గొనేది. తన వల్ల షూటింగ్ ఆగకూడదు అనేది. ఆమెకు అనారోగ్యంగా ఉందనే విషయం డబ్బింగ్ సమయంలో తెలిసింది. భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాలో అలాంటి ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలుంటాయి. సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సినిమా కోసం వేసిన సెట్స్ ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలో ఇతర భాషల నటులున్నారు. అయితే ఓటీటీలు వచ్చాక నటులకు భాషా హద్దులు చెరిగిపోయాయి. అది మా సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇందులో ఎక్కువ మంది మహిళలు నటించారు. సహజత్వం కోసం ప్రెగ్నెన్సీతో కొందరిని తీసుకున్నాం. సినిమాలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అంశాలంటాయి. ఇదే సంస్థలో మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా విడుదలయ్యాక ఆ పనులు ప్రారంభిస్తాం’ అన్నారు.