Hansika Motwani | విఫల ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం బాధించడంతో పాటు ఎన్నో గుణపాఠాల్ని నేర్పిస్తాయని అంటున్నది అగ్ర కథానాయిక హన్సిక. గత డిసెంబర్లో ఈ భామ సోహైల్ కతూరియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన పెళ్లి ఘట్టాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఓటీటీ ప్లాట్ఫామ్లో సిరీస్‌గా విడుదల చేసింది హన్సిక. ప్రస్తుతం వైవాహిక బంధంలో ఆనందంగా ఉన్నానని, గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని పూర్తిగా చెరిపివేసుకున్నానని చెప్పిందీ భామ. అయితే కెరీర్ ఆరంభంలోనే లవ్ ఫెయిల్యూర్ వల్ల కొత్త బంధంలోకి అడుగుపెట్టడానికి దాదాపు ఏడేండ్ల పాటు నిరీక్షించానని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ ‘ప్రేమ, వివాహ వ్యవస్థ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. గత అనుభవాల భయంతో దాదాపు ఏడేళ్ల పాటు ఒంటరిగానే ఉన్నా. ఎలాంటి రిలేషన్లోకి అడుగపెట్టొద్దని నిర్ణయించుకున్నా. అదే సమయంలో సోహైల్ పరిచయమయ్యాడు. అతను చూపించిన ప్రేమ జీవితం పట్ల నాకు కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసింది. దేవుడే నా మనసుకు సాంత్వన చేకూర్చడానికి అతన్ని పంపించాడేమో అనుకున్నా’ అని చెప్పింది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో శింబుతో కొంతకాలం ప్రేమాయణాన్ని సాగించింది హన్సిక. ఆ విఫల ప్రేమ బంధం గురించి హన్సిక పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసింది.