Shivalayam | తెలుగు తెరపై మరో ఆధ్యాత్మిక భక్తి రస చిత్రం రూపుదిద్దుకునేందుకు సర్వం సిద్ధమైంది. భక్తి, భావోద్వేగాలు, దైవిక లీలల సమాహారంగా తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ (Shivalayam) పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ నటినటులు, సాంకేతిక నిపుణులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ఈ ముహూర్తపు వేడుక చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ మరియు కాంచన దీప్తిరెడ్డి ప్రధాన జంటగా నటిస్తున్నారు. నందిరెడ్డి వెంకట్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర యూనిట్‌కు ఘనంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను సినీ ప్రముఖులు పంచుకున్నారు. నటుడు, నిర్మాత లెంకల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా దర్శకుడు వెంకట్‌రెడ్డి ఎంతో శ్రద్ధగా ప్రీ-ప్రొడక్షన్ పనులు పర్యవేక్షించారని, దైవభక్తి నేపథ్య చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుందని, ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు వెంకట్‌రెడ్డికి ఇది 11వ సినిమా కావడం విశేషమని, ఈ చిత్రంలో తాను కూడా నటిస్తున్నానని తెలిపారు.
సహ నిర్మాత దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తన తండ్రి ఆశీస్సులతో ‘దరిపల్లి అనంత రాములు ప్రొడక్షన్స్’ బేనర్‌పై వస్తున్న ఈ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. డ్రమ్స్ రాముతో కలిసి తాను చేస్తున్న ఈ ప్రయాణంలో శివాలయం ద్వారా మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ధైర్యం వెలిబుచ్చారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, శివుడి నేపథ్యంలో వచ్చే కథలు ఎప్పుడూ అద్భుతమైన విజయం సాధిస్తాయని, మంచి భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కావడం ఆనందంగా ఉందంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
దర్శక నిర్మాత వెంకట్‌రెడ్డి నంది మాట్లాడుతూ, శివుడి లీలలు, మహిమలు, అపారమైన భక్తి భావాలను నేటి తరానికి సరికొత్తగా ఆవిష్కరించే ఉద్దేశంతో ‘శివాలయం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్లు వెల్లడించారు. కథపై చాలాకాలం కసరత్తు చేశామని, రాబోయే సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
ఈ చిత్రంలో ఘర్షణ శ్రీనివాస్, లెంకల అశోక్ రెడ్డి, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, కుప్పిలి శ్రీనివాస చారి, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: డ్రమ్స్ రాము, కొరియోగ్రఫీ: నిహారిక చౌదరి, డి.ఓ.పి: డి. యాదగిరి, పీఆర్ఓ: అశోక్ దయ్యాల వ్యవహరిస్తున్నారు.