Multiplex| ఇప్పుడు పబ్లిక్ టైమ్ పాస్ కోసం ఎక్కువగా మల్టీ ప్లెక్స్కి మాల్స్‌కి వెళుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఉండే ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నా కూడా సరదాకి అటే వెళుతుంటారు. అయితే సినిమా లేదా షాపింగ్‌కి వెళ్లి ఏదైన ఖర్చు చేశామంటే ఓకే కాని పార్కింగ్ లో వాహనాలకు విధించే ఛార్జీలు చూసి వాహనదారులు బెంబేలెత్తుతుండడం కొన్నాళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి రాష్ట్రంలోను ఈ పాలసీ ఉండగా, దీనిపై ప్రజలు తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల ఫోరాలు, కోర్టులు పలు తీర్పులు ఇచ్చినా కూడా అవి అమలు అయిన సందర్భాలు చాలా తక్కువ.
ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం పార్కింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో ఉన్న పార్కింగ్ స్ధలాల్లో వాహనాల పార్కింగ్ కు తొలి అరగంట పాటు పూర్తి ఉచితంగా నిర్ణయించారు. ఆ తర్వాత మాత్రమే కొన్ని షరతులతో ఆయా మల్టీప్లెక్స్ లు, మాల్స్ పార్కింగ్ విధించే అవకాశం కల్పించారు. ముందుగా ఆయా మల్టీప్లెక్స్ లలో ఉండే సినిమా థియేటర్లలో సినిమాలకు వెళ్లిన వారు టికెట్ చూపిస్తే వారి దగ్గర పార్కింగ్ ఫీజ్ ఏ మాత్రం వసూలు చేయకూడదు. అలాగే మాల్ కు వెళ్లిన వారు షాపింగ్ చేసిన బిల్లు చూపించినా కూడా పార్కింగ్ ఫీజు నుండి కాస్త మినహాయింపు ఉంటుందట.
సరదాగా మాల్కి వెళ్లి టైం పాస్ చేయాలనుకునేవారు అరగంట మాత్రమే పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారి వాహనాలకు పార్కింగ్ పీజు వసూలు చేస్తారు. అయితే ఈ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మల్టీ ప్లెక్స్‌లు, మాల్స్‌లో ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారో అంతే ప్రస్తుతానికి వసూలు చేయనున్నట్టు తెలుస్తుంది. వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానుండగా, ఇవి కాస్త ఊరటనిచ్చేవిగా ఉన్నాయని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి రూల్స్ తెలంగాణలో కూడా వస్తే బాగుంటుందని చెప్పుకొస్తున్నారు.