హీరో గోపీచంద్ అంటే యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు. వీటితో పాటు ఆయన అద్భుతమైన కామెడీని కూడా పండిస్తారు. ఈ రెండు అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన చిత్రమే ‘విశ్వం’ అని చెప్పారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో గోపీచంద్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
శ్రీనువైట్ల గతంలో రెండు కథలు చెప్పారు. అవి బాగున్నా..నాకు అంతగా సరిపోవనిపించింది. ‘విశ్వం’ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా కుదిరింది. శ్రీను వైట్ల ఏడు నెలల పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. ఆయన మార్క్ యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా..ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరాయి.
‘లౌక్యం’ తర్వాత అదే స్థాయి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కుదిరింది. షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను. నా సహనటీనటులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. సినిమాలో అంత అద్భుతమైన కామెడీ పండింది.
అందరూ ఈ సినిమాలోని ట్రెయిన్ ఎపిసోడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘వెంకీ’ చిత్రంలోని పాపులర్ ట్రెయిన్ ఎపిసోడ్‌తో పోల్చుతున్నారు. ఈ రెండు చిత్రాల జోనర్స్ వేరు కాబట్టి పోలిక ఏమాత్రం ఉండదు. ట్రెయిన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. వెన్నెల కిషోర్, వీటీ గణేష్, నరేష్, ప్రగతి..అందరూ మంచి కామెడీని పండించారు.
ఈ సినిమాలో మదర్, ఫాదర్ ఎమోషన్ హార్ట్‌టచింగ్‌గా అనిపిస్తుంది. ఈ కథలో పాప పాత్ర ప్రధానంగా ఉంటుంది. తన చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు హృదయాన్ని బరువెక్కిస్తాయి. పాప పాత్ర సినిమాకు చాలా ప్లస్ అయింది.
శ్రీను వైట్ల సినిమా అంటే యాక్షన్, కామెడీలతో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్లా ఉంటుంది. ‘విశ్వం’లో కూడా అవన్నీ బాగా కుదిరాయి. సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు. నాన్‌స్టాప్‌గా నవ్వుల్ని పంచుతుంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు విశ్వం. రెండు అక్షరాల టైటిల్స్ నాకు సెంటిమెంట్ అనే కోణంలో ఈ టైటిల్ పెట్టలేదు. కథానుగుణంగా టైటిల్ కుదిరింది.
మనాలి, ఇటలీ, పర్టీనియా వంటి సుందరమైన లోకేషన్స్‌లో తీసిన సీన్స్ కన్నులపండువగా అనిపిస్తాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఓ ఇష్యూని ఈ కథలో చర్చించాం. అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ చిత్రం కోసం కథా చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలన్నీ త్వరలో వెల్లడిస్తాను.