Gopichand Next Movie | అదేంటో కొంత మంది హీరోలకు కొన్ని క్యారెక్టర్లు భలే సెట్టవుతుంటాయి. ప్రేక్షకులు కూడా ఆ ఫలానా హీరోను ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్లో చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాగా యాక్షన్ హీరో గోపిచంద్‌కు పోలీస్ క్యారెక్టర్ ఇట్టే సెట్టవుతుంది. ఆరడుగుల ఎత్తు, ఆరుపలకల దేహం, మోహంలో గాంభీర్యం ఇలా ఒక పోలీస్‌కు ఉండే అన్ని అర్హతలు గోపిచంద్‌కు ఉన్నాయి. అందుకేనేమో ఆయన పోలీస్ క్యారెక్టర్ చేస్తే నటించినట్టు కాకుండా జీవించినట్లు ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. గోపిచంద్ తన తదుపరి సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడని సమాచారం.
ఈ మధ్య కాలంలో గోపిచంద్‌ను వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన రామబాణం సినిమా పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాంతో తనకు కలిసి వచ్చిన పోలీస్ క్యారెక్టర్‌ను ఈసారి నమ్ముకున్నట్లు సమాచారం. గోపిచంద్ ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేశాడు. ఆ నాలుగు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. దాంతో గోపిచంద్ తన తదుపరి సినిమాను పోలీస్ నేపథ్యంలో చేస్తున్నాడని టాక్. ఇక చివరగా గోపిచంద్ ‘గోలిమార్’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాడు. ఈ లెక్కన మళ్లీ పుష్కర కాలం తర్వాత ఖాకీ చొక్కా తొడుక్కోబోతున్నాడన్న మాట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.