‘దర్శకుడు కిరణ్‌తో నాలుగేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. ఈ సినిమా విషయంలో నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. అతని విషయంలో నేను కరెక్ట్ ఛాయిస్ తీసుకున్నా. దర్శకుడిగా కిరణ్‌కు గొప్ప భవిష్యత్తు ఉంది’ అన్నారు వరుణ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పకుడిగా అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన చిత్రం ‘గని’ నేడు ప్రేక్షకులముందుకొస్తున్నది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతిబాబు, నదియా వంటి సీనియర్స్‌తో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నా. నిర్మాతలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అధైర్యపడుకుండా సినిమాను పూర్తిచేశారు’ అని చెప్పారు.
‘ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ అనొచ్చు. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతిబాబు, నవీన్‌చంద్ర వంటి హీరోలంతా కలిసి పనిచేశారు. తమన్ సంగీతాన్నందించిన చిత్రాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా విజయం ఖాయమని నమ్ముతున్నా’ అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ ‘తెలుగులో ‘ఓంకారం’ చిత్రాన్ని డైరెక్ట్ చేశా. అదే సమయంలో చిరంజీవిగారి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అశ్వనీదత్‌గారు నిర్మాత. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఇప్పటికీ ఆ సినిమా మిస్ అయిందని బాధపడుతుంటా. వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని చూశాను. ఇప్పుడీ సినిమాతో నటుడిగా మరింత పరిణితి చెందాడు’ అని ఉపేంద్ర ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్‌శెట్టి పాల్గొన్నారు.