Ghani On OTT | అప్పట్లో సినిమాలు థియేటర్లలో వంద నుంచి నూటయాభై రోజులకు పైగా ఆడేవి. ఇక ఆ సినిమా టీవీలో రావాలంటే కనీసం ఆర్నెళ్ళైనా పట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఐనా సరే 4 నుంచి 5 వారాల్లోపే డిజిటల్లోకి వస్తుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘పుష్ఫ’ నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇటీవల విడుదలై పరాజయం పాలైన ‘రాధేశ్యామ్’ రెండు వారాల్లోనే డిజిటల్లో సందడి చేసింది. ఇలా హట్టు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా ప్రతి నెల ఓ కొత్త సినిమా ఓటీటీలో దర్శనమిస్తుంది. ఈ క్రమంలోనే ఈ వారం విడుదలైన ‘గని’ సినిమా కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఈ శుక్రవారం విడుదలైన గని చిత్రం మొదటి షోనుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూడటానికి ఆసక్తి చూపడంలేదు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రమోషన్లను కూడా చేయలేదు. దాంతో చాలా మందికి ఈ సినిమా విడుదలవుతున్న విషయమే తెలియకుండా పోయింది. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దూముద్ద, అల్లుబబీ సంయుక్తంగా నిర్మించారు. వరుణ్ జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు.