Gangubai kathiawadi Movie Awards | ఏడాది క్రితం వచ్చిన గంగూబాయి కతియావాడి ఇండియన్ బాక్సాఫీస్‌పై పెను సంచలనమే సృష్టించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఆ రేంజ్ హడావిడి మునుపెన్నడూ జరుగలేదు. సంజయ్‌లీలా భన్సాలీ విజన్‌కు, ఆలియాభట్ నటనకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. వంద కోట్ల బొమ్మతో హిందీ బెల్ట్‌పై ఆలియాభట్ విజయ కేతనం ఎగురవేసింది. కలెక్షన్లే కాదు అవార్డులు సైతం గంగూబాయికి దాసోహం అయ్యాయి. నెల రోజల కిందట జరిగిన 68వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఐఫా అవార్డుల్లో మరోసారి సత్తా చాటింది.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబి లో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డు ఫంక్షన్లో గంగూబాయి సినిమాకు మూడు అవార్డులు వరించాయి. బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఉత్కర్శిని వషిష్ఠ అవార్డును గెలుచుకున్నారు. ఇక బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్ ఛటర్జీ అవార్డు అందుకున్నాడు. ప్రకాష్ కపాడియా-ఉత్కర్శిని వషిష్ఠ బెస్ట్ డైలాగ్ విభాగంలో అవార్డు అందుకున్నారు. ఇలా మూడు విభాగాల్లో గంగూబాయి అవార్డులు కైవలం చేసుకుంది.
భూల్ భూలయ్య-2 సినిమాలో టైటిల్ సాంగ్‌కు సీజర్ గోన్సాల్వేస్, బోస్కో మార్టిన్స్ ఉత్తమ కొరియోగ్రాఫీ విభాగంలో అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాకు బెస్ట్ సౌండింగ్ విభాగంలోనూ అవార్డు వరించింది.
అజయ్ దేవగణ్ దృశ్యం-2కు బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో సందీప్ ఫ్రాన్సిస్ అవార్డు గెలుచుకున్నాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో బ్రహ్మస్త్ర సినిమాను అవార్డు వరించింది. ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో విక్రమ్ వేద సినిమాలోని మోనికా ఓ మై డార్లింగ్ పాటకు అవార్డు వచ్చింది.