ఒకప్పుడు కూలి నాలి చేసుకుంటూ కాలం గడిపిన గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీ అయింది. ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్స్,ఇంటర్వ్యూలు ఇలా ఒకటేంటి అనేక ఆఫర్స్‌తో ఫుల్ బిజీగామారింది.
లేటు వయసులో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చినా.. చిన్న వయసులో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాలను ఆమె నాగార్జున ముందు కూడా చెప్పుకున్నారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకొని, బుక్కెడు అన్నం తింటే అదే చాలని గంగవ్వ అన్నారు. అయితే తాను కన్న కలను ఎట్టకేలకు నిజం చేసుకుంది గంగవ్వ.
బిగ్ బాస్ ద్వారా రూ.11 లక్షలు సమకూర్చుకున్న గంగవ్వకు నాగార్జున రూ.7 లక్షల రూపాయలు సాయం చేశాడు. మరో రూ.3లక్షల వరకు అప్పుచేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది.తాజాగా గంగవ్వ కొత్తింటి గృహప్రవేశం జరగగా, ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. అయితే అనుకున్న కోరికను నెరవేర్చుకున్నందుకు గంగవ్వని అభినందిస్తూ అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.