Sonu Nigam | ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదైంది. బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఏప్రిల్ 25-26 తేదీల్లో జరిగిన సంగీత కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ ప్రేక్షకుడు పదేపదే కన్నడ పాట పాడాలంటూ అరిచాడు. దాంతో అసహనానికి గురైన సోను నిగమ్.. ఆ యువకుడి ప్రవర్తనను కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడితో పోలుస్తూ హిందీలోనూ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కన్నడ.. కన్నడ అంటూ యువకుడు అరిచిన తీరును తనకు నచ్చలేదని.. ఇలాంటి ప్రవర్తన కారణంగానే పహల్గాం లాంటి దాడులు జరుగుతాయని సోను నిగమ్ అన్నట్లుగా విమర్శలున్నాయి. అయితే, సోను నిగమ్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలు తీవ్రంగా బాధించాయని.. భాషాభిమానం, సాంస్కృతిక గర్వాన్ని హింసతో పోల్చడం ఏమాత్రం సరికాదంటూ మండిపడ్డారు.
ఈ క్రమంలో కర్నాటక రక్షణ వేదిక బెంగళూరులోని అవలహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోను నిగమ్ వ్యాఖ్యలు వివిధ భాషా సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, హింసను ప్రేరేపించే అవకాశం ఉందని సదరు సంస్థ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, పరువు నష్టం, మత-భాషా పరమైన మనోభావాలను దెబ్బతీయడం తదితర సెక్షన్ల కింద శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై సోను నిగమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను కన్నడ పాట పాడమని అడిగినందుకు కాదని, కొందరు వ్యక్తులు బెదిరింపు ధోరణితో ప్రవర్తించినట్లుగా ఆరోపించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, పహల్గాం దాడిని ఉదాహరణగా చెప్పి, ప్రేమ ఉన్నచోట విద్వేషానికి తావులేదని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.