మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఫైటర్ శివ’. ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకుడు. నర్సింహ గౌడ్, ఉన్నం రమేశ్ నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ టీజర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘యముడికి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’, ‘నేను పవన్‌కల్యాణ్ లెక్క.. గెలిచే వరకూ పోరాడుతా..’ వంటి డైలాగులు ఈ టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. ఆద్యంతం యాక్షన్ ఓరియంటెడ్‌గా టీజర్ సాగింది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు హీరో మణికాంత్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా దర్శకుడు ప్రభాస్ నిమ్మల, ఎమ్మెల్యే రామలింగం, నిర్మాతలు నర్సింహా గౌడ్, ఉన్నం రమేశ్, సంగీత దర్శకుడు గౌతం రవిరాం, డీవోపీ సురేందర్‌రెడ్డి, నటులు శ్రీధర్, ఆనంద్, ఎడిటర్ విశ్వనాథ్ కూడా మట్లాడారు.