Tollywood female Directors | సాధారణంగా సినీరంగంలో ఆడవాళ్లు ఎక్కువగా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటారు. కొందరు మాత్రమే ఇతర విభాగాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక దర్శకత్వ విభాగంలో పనిచేసిన మహిళలను వేళ్లతో లెక్కపెట్టచ్చు. అయితే మగవాళ్ళ కంటే తామేమి తక్కువ కాదని నిరూపించిన మహిళా దర్శకులు మన ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. ఇక మెగాఫోన్ చేతపట్టిన మహిళా దర్శకులు ఎవరెవరున్నారో ఓ లుక్కేద్దాం.
పి. భానుమతి:
తెలుగు ఇండస్ట్రీలో మెగాఫోన్ పట్టిన తొలి మహిళగా పి.భానుమతి చరిత్ర సృష్టించింది. అప్పటికే నటిగా ఫుల్ బిజీగా ఉన్న భానుమతి ‘చండీరాణీ’ అనే సినిమాను 1953లో తెరకెక్కించింది. అప్పట్లోనే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు కూడా ఆమెనే తీసుకుంది. భానుమతి తన సినీ జీవితంలో 14సినిమాలకు దర్శకత్వం వహించింది.
వరలక్ష్మీ:
భానుమతి తర్వాత దాదాపు పదిహేనేళ్ల వరకు మరో మహిళ మెగాఫోన్ పట్టలేదు. అలా 1968లో నటి జి.వరలక్ష్మీ ‘మూగజీవులు’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. రంగస్థల నటిగా కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మీ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా, మరెన్నో సినిమాల్లో సహాయనటిగా పనిచేసింది.
సావిత్రి:
నటిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేసుకున్న సావిత్రి ‘చిన్నారి పాపలు’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయినా.. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సావిత్రి తెలుగు, తమిళ భాషల్లో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించింది.
విజయనిర్మల:
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన విజయ నిర్మల తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో రెండొందలకు పైగా చిత్రాల్లో నటించింది. ఇక ఆమె 1972లో ‘కవిత’ అనే మలయాళ సినిమాను దర్శకత్వం వహించింది. ఆ తర్వాత ఏడాది తెలుగులో ‘మీనా’ సినిమాను తెరకెక్కించింది. తొలి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని సాధించి దర్శకురాలిగా తన ప్రతిభ ఏ స్థాయిదో ప్రపంచానికి చాటి చెప్పింది. దర్శకత్వం మీదున్న మక్కుతో ఏకంగా 44సినిమాలకు దర్శకురాలిగా పనిచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరు లిఖించుకుంది.
బి.జయ:
జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బి.జయ సినీవారపత్రికను స్థాపించింది. ఆ తర్వాత దర్శకత్వంపై మక్కువ పెంచుకుని ‘ప్రేమలో పావని కళ్యాణ్’ అనే సినిమాతో దర్శకురాలిగా తొలిసినిమా తెరకెక్కించింది. అయితే బాల ఆదిత్య హీరోగా నటించిన ‘చంటిగాడు’ సినిమా జయకు తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దాదాపు అరడజను సినిమాలకు దర్శకురాలిగా పనిచేసింది.
జీవిత రాజశేఖర్:
నటిగా ఎన్నో సినిమాలతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న జీవిత.. హీరో రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే ‘శేషు’ సినిమాతో మెగాఫోన్ చేతబట్టి తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చిపెట్టుకుంది. చివరగా ఆమె ‘శేఖర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘జోసెఫ్’కు రీమేక్‌గా తెరకెక్కింది.
సుచిత్ర చంద్రబోస్:
ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకత్వం మీద మక్కువతో రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకుని రాజాగౌతమ్తో ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.
నందిని రెడ్డి:
‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి తొలి సినిమాకే నంది పురస్కారం గెలుచుకుంది. ఆ తర్వాత ‘జబర్ధస్త్’, ‘కళ్యాణవైభోగమే’, ‘ఓ బేబి’ వంటి సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహించిన అన్ని ‘మంచి శకునములే’ విడుదలకు సిద్ధంగా ఉంది.
మంజుల:
సూపర్‌స్టార్ కృష్ణ కూతురు, మహేష్‌బాబు అక్క మంజుల సందీప్ కిషన్‌తో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించింది. దర్శకురాలిగానే కాకుండా నటిగా, నిర్మాతగానూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వీరితో పాటుగా హీరో నాని సోదరి దీప్తి ఘంటా ఇటీవలే ‘మీట్‌క్యూట్’ అనే ఆంథాలజీ సినిమాను తెరకెక్కించి గొప్ప ప్రశంసలు అందుకుంది. కమెడియన్ ఎమ్.ఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ ‘సహేబా సుబ్రహ్మణ్యం’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. వీళ్లతో పాటు శ్రీ ప్రియా(దృశ్యం), శ్రీరజిని(రంగులరత్నం), సంజనా రెడ్డి(రాజుగాడు), చునియా(పడేశావే) వంటి మహిళలు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.